Mucchataina NewNudi Mullapudi

“బాపు రమణీయం” అని మనం అందరం స్నేహానికి నిలువెత్తు రూపంగా బాపు-రమణ లనే ఎప్పటికి చెప్పుకుంటాం. భరణి గారు అన్నట్టు తిరుపతి అనగానే వేంకటేశ్వరుడు ఎలా గుర్తోస్తాడో, బాపు అనగానే మన రమణే గుర్తొస్తాడు. రమణ గారి పేరు వినగానే ఆంధ్రులకి వెంటనే గుర్తొచ్చేది “బుడుగు” మరియు “అప్పుల అప్పారావు” పాత్రలే.

ముళ్ళపూడి వెంకట రమణ అంటే తెలుగు వాళ్ళకి అంతులేని అభిమానం.అందుకు కారణం అందరి రచయితల్లా కేవలం వ్యాసాలు,కధలు,నవలలు రాయడం లో ప్రతిభ చూపడమే కాదు.,భాషను ప్రయోగించడం లో రమణ గారు చూపిన కొంటెతనం, చిలిపితనం, కొత్తదనం.

mullapudi

భాష శబ్దార్ధాల సమాహారం

సందర్భాన్ని బట్టి భాషలో శబ్దాల ప్రయోగం ఉండేది. దాని వల్ల వచ్చే అర్ధం నవ్వించేది. పాత్ర ఉద్దేశాన్ని బట్టి భాషలో ప్రత్యామ్నాయంగా ఉన్న పదాలలో కొన్నిటితో హాస్యాన్ని పండిచేవారు రమణ. విషయాన్ని గంభీరంగా చెప్పదల్చుకుంటే ఆయన మరణించారు అంటారు. హాస్యంగా చెప్పాలి అనుకుంటే టపా కట్టేసాడు, బకెట్ తన్నేసాడు అంటారు.ఆయన ఎన్నో రచనలన్నీ హాస్యధోరణితోనే రచించారు. ముఖ్యంగా హస్యరచనలకు ప్రసిద్దుడయ్యాడు మన రమణ.

భాషను వాడుకోవడంలో రమణ చూపిన లాఘవం పాఠకులని పరవశుల్ని చేస్తుంది. కాడిలాక్ కారున్నవాడిని కాడిలాకియర్ అని, అప్పుచేసి బతికే పద్ధతిని అప్పోమానియా అని,సినిమాలు తీసేవారు సినిమా కారులు అని, సినిమాల పిచ్చి ఉండడం సినీమేనియా అని. సినీ జీవులకి సంబంధించిన కొత్త జబ్బుని కూడా కనిపెట్టారు మన రమణ – అదే సెరిబ్రల్ సినేరియా. అంతే కాదండోయ్,రమణ గారు-బాపు గారు అద్దెకుండే ఇంట్లో రాత్రి పూట హాలులో మందు పార్టీ పెట్టుకునే వారట,దానికి రమణ గారు పెట్టిన పేరు “ఆల్కహాల్”.ఇలా పదప్రయోగంలో ఎన్నో కొత్తపోకడలు పోయారు రమణ.పదాలతో ఆడుకున్నారు.వాటిలో రెండు వేరు వేరు పదాలను ఏకకాలం లో ప్రయోగించి కొత్త అర్ధాన్ని కల్పించిన ప్రతిభ రమణది.అందులో క్రిటికా తాత్పర్యాలు(క్రిటిక్ టీకా తాత్పర్యాలు అని) లాంటి పదాలు కోకొల్లలు.

భాష లో మనం వాడే నుడికారాలు,పలుకుబడులు కొత్త అర్ధాలతో ప్రయోగించారు రమణ.

ఉదాహరణకి బుడుగు లో…..

“బామ్మ బుడుగుని వెనకేసుకొస్తుంది.బామ్మ లావుగా ఉంటుంది కనుక తను కనపడకుండా వెనక నున్చుంటాడు కాబట్టి వెనకేసుకొస్తుంది అంటాడు బుడుగు.”

“బాబాయ్,రెండు జెళ్ళ సీత చనువుగా ఉండడం చూసి వాళ్ళ వరసేమి బాలేదు అనుకుంటుంది బామ్మ.వాళ్ళిద్దరూ ఎదురు ఎదురుగా కూర్చోకుండా పక్క పక్కన కూర్చున్నారని అలా అంది బామ్మ అని అనుకుంటాడు.”

వాక్య విన్యాసం లో కూడా రమణ మంచి నేర్పరి. “అవినీతి కధలు కాదు అవి నీతి కధలు” అనడం, “సిగరెట్టులు తెల్లగా ఉంటాయి – అగరొత్తులు నల్లగా ఉంటాయి.అగరొత్తులు గోడ మీద గుచ్చి కాలుస్తారు,సిగరెట్టులు నోట్లో పెట్టుకు కాలుస్తారు”అని.”బాబాయ్ సంజె వారుస్తాడు,బామ్మ గంజి వారుస్తుంది”……..ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. నుడికారాలు,సామెతలు వాడుకలో ఉన్నవాటిని ప్రయోగించినప్పుడు వక్త ఒక అర్ధం లో అంటే శ్రోత ఇంకో అర్ధం చేసుకున్నట్టు సృష్టించి సన్నివేశం హాస్యస్ఫూర్తితో తీర్చిదిద్దేవారు.

“నా మొహంలా ఉంది అంటే – ఏదో నీ అభిమానం కొద్ది మెచ్చుకుంటావు” అన్న సందర్భాలు.

“వీళ్ళు ఎక్కడ్నుంచి వచ్చారండి మన ప్రాణానికి అని వక్త అంటే – అడ్రెస్సు తర్వాత కనుక్కుందాం” అని శ్రోత వ్యంగ్య సమాధానాలు.

“నువ్వెందుకు పనికొస్తావు అంటే – నేనాండి అని తాను చెయ్యగలిగే పనులు చెప్పడం”. ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో….

ఇలా చెప్పుకుంటూ పోతే ముళ్ళపూడి వారి రచనలలో పదాలు,సామెతలు,వాక్యాలు కొత్త కొత్తగా మనల్ని నవ్విస్తాయి,కవ్విస్తాయి.హాస్య రచనలలో రమణ గారిది ఫోర్జరీ చెయ్యలేని సంతకం.

హాస్యం,వెటకారం,సూటి మాటలు,వేళాకోళాలు,వ్యంగ్యం,చమత్కారం – ఇంత “కలాపోసన” మన ముళ్ళపూడి రమణీయుడికే సాధ్యం…!

                                                                     –సహృదయ్ పున్నమరాజు.

LEAVE A REPLY